|
|
| ఆలయ భూములకు భద్రత |
| ప్రచురణ తేది: 25/08/2009 |
|
దేవాదాయ భూములకు సహ చట్టం రక్షణగా నిలిచింది. కబ్జారాయుళ్ల పాలైన 2,821 ఎకరాలపై అధికారులు స్పందించేలా చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో 822 ఆలయాలు ఉన్నాయి. వీటికి 11,120.53 ఎకరాల భూములు ఉన్నాయి. దీంట్లో పల్లం 6236.5 ఎకరాలయితే మెట్ట 4854.02 ఎకరాలు. మొత్తం భూముల్లో 2821 ఎకరాల 56 సెంట్లు ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. ఆలయ అర్చకుల స్వాధీనంలో 1583 ఎకరాల 34 సెంట్లు భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆలయాల ఆస్తుల గురించి అడుగుతూ సంబంధిత అధికారులకు శ్రీకాకుళానికి చెందిన కర్ణకుమార్ సహ దరఖాస్తు చేశారు. వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. దేవుడి ఆదాయానికి అడుగడుగునా ఎలా గండి పెడుతున్నారో వెలుగులోకి వచ్చింది. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురంలో 340 ఎకరాలకు గానూ 42 ఎకరాలు మాత్రమే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. గార మండలం అంపోలు అగస్త్యేశ్వరస్వామికి వివిధ గ్రామాల్లో ఉన్న 103 ఎకరాల భూమిలో 40 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా మరికొన్ని దేవాలయాల భూములూ అన్యాక్రాంతమయ్యాయి. ఈ ఆక్రమణల పర్వంపై 'ఈనాడు'లో కథనం ప్రచురితమవడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడి కలెక్టర్ శ్రీకాంత్ వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలయ భూములకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. కబ్జాదారులకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా దేవాలయాలకు ఉన్న ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. వాటన్నింటిపై సహ దరఖాస్తులు సంధిస్తే కబ్జారాయుళ్లకు ముకుతాడు వేయవచ్చు.
- ఎం.సురేష్, న్యూస్‌టుడే, శ్రీకాకుళం |
|