శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: సమాచార దీపశిఖ.. మనీష్ శిశోడియా...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
సమాచార దీపశిఖ.. మనీష్ శిశోడియా
ప్రచురణ తేది: 15/09/2009

ది ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం.. అక్కడి ఉద్యోగి వద్దకు ఒక యువకుడు వచ్చాడు. రెండేళ్ల నుంచి తమ నీటి బిల్లుల్లో తేడాలుంటున్నాయని.. డబ్బు కట్టినా కట్టలేదని వస్తోందని చెప్పాడు. 'సవరించిన నీటి బిల్లును మీకెప్పుడో పంపాం'.. అని ఉద్యోగి సమాధానం. 'నాకు బిల్లు అందలేదు. మీరు పంపాన్నంటున్న దానికి నకలును (కార్యాలయ ప్రతి) చూపించండి' అని యువకుడు అడిగాడు. 'నీకు చూపించడానికి మేం ఖాళీగా లేం' అని విసుగ్గా చెప్పాడా ఉద్యోగి. దాంతో యువకుడు ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పాడు. పని ఎక్కువగా ఉంది.. తర్వాత కలవమని అధికారి సూచించారు. 'సరే సార్.. మీ పని అయిన తర్వాతే నా బిల్లు సంగతి చూడండి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎన్ని రోజులైనా కదలను' అని స్పష్టం చేసిన యువకుడు.. అధికారి ఎదురుగానే మౌనంగా కూర్చొన్నాడు. సత్యాగ్రహానికి దిగివచ్చిన అధికారి.. అర్థగంటలో సమస్యను పరిష్కరించారు.

గాంధీజీ సత్యాగ్రహ బాటలో సమస్యను పరిష్కరించుకున్న యువకుడి పేరు మనీష్ శిశోడియా. జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని కాపుగాస్తున్న ఉద్యమకారుల్లో ఒకరు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత అరవింద్ కెజ్రీవాల్‌తో కలసి మనీష్ సహ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ముఖ్యమైన సమస్యలపై సొంతంగా దరఖాస్తులు, బహిరంగ సభలు, సహ చట్టం ప్రయోజనాలు - విజయాలపై లఘ చిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణం చేస్తున్నారు.

పాత్రికేయ వృత్తి నుంచి..
సహ ఉద్యమంలోకి రాకముందు మనీష్ శిశోడియా పాత్రికేయుడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివిన మనీష్.. జీ న్యూస్ ఛానల్‌లో పాత్రికేయునిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు. లంచావతారుల వికృతరూపాలను, సామాన్యుల వెతలను ఆయన తన వృత్తిపరంగా చాలా దగ్గర నుంచి పరిశీలించారు. ప్రజల్లో చైతన్యం తెస్తేనే అవినీతిని నిర్మూలించగలమని మనీష్ విశ్వాసం. లక్ష్యంతోనే 'పరివర్తన్'లో సభ్యునిగా అరవింద్ కెజ్రీవాల్‌తో కలసి పని చేసేవారు. కొన్నాళ్ల తర్వాత.. పూర్తిస్థాయిలో ఉద్యమానికి అంకితమయ్యారు. పరివర్తన్‌తో పాటు కబీర్, పబ్లిక్ కాజ్ రిసెర్చ్ ఫౌండేషన్ (పీసీఆర్ఎఫ్) తదితర సంస్థల్లో మనీష్ వ్యవస్థాపక సభ్యులు. సహ చట్టానికి సంబంధించిన అంశాలపైనే ప్రత్యేకంగా వెలువడే 'అప్నా పన్నా' అనే మాస పత్రికకు ఆయన సంపాదకుడు.

'కబీర్' పంథా ఇది..
సహ చట్టాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లాలనే ఆశయంతో 'కబీర్' ఏర్పడింది. దీనికి మనీష్ శిశోడియా ముఖ్య కార్యనిర్వాహకులు. సంస్థ కార్యాచరణ రూపకల్పనలో ఆయనది కీలక పాత్ర. వివిధ మార్గాలలో.. వేరు వేరు కార్యక్రమాల ద్వారా 'కబీర్' చట్టంపై ప్రచారం చేస్తోంది. గతంలో 'ఎన్డీటీవీ'తో కలసి 15 రోజుల దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సమయంలో 1500 మందికి చట్టంపై శిక్షణిచ్చింది. దాంతో పాటు 45 వేల మంది దరఖాస్తుదారులకు సలహాలు, సూచనలు అందించింది. 21 వేల దరఖాస్తులు దాఖలయ్యేలా చేసింది. 'కబీర్' చేసిన మరో వినూత్న ప్రయత్నం.. కేంద్ర సమాచార కమిషన్ కార్యాలయం ముందు శిబిరం నిర్వహణ. కమిషన్‌లో విచారణ పూర్తి చేసుకుని వచ్చే అప్పీలు/దరఖాస్తుదారులతో సంస్థ సభ్యులు మాట్లాడేవారు. కమిషన్ ఇచ్చిన తీర్పులను పరిశీలించి.. చట్ట స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండేవాటిని గుర్తించేవారు. అలాంటి వాటిపై హైకోర్టులో 'పీసీఆర్ఎఫ్' ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేసేది. భోపాల్ గ్యాస్ బాధితులతో కూడా 'కబీర్' విరివిగా దరఖాస్తులు చేయించింది. దాంతో అప్పటి వరకు దుర్ఘటనకు సంబంధించిన దాచి ఉంచిన ఫైళ్లను ప్రభుత్వం బయటపెట్టింది. ఇలా చెప్పుకెళితే..'కబీర్' నిర్వహించిన ప్రచార కార్యక్రమాలెన్నో!

సేకరించి.. విశ్లేషించి
సమస్యలకు కారణాలను శోధించడం, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల శ్రద్ధపై పరిశీలన, ప్రభుత్వ పాలనాంశాలపై సమగ్ర పరిశోధనే లక్ష్యంగా పబ్లిక్ కాజ్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటైంది. రచయిత అభినందన్ శేఖరి, అరవింద్ కెజ్రీవాల్‌లతో కలసి మనీష్ దీన్ని నెలకొల్పారు. సహ దరఖాస్తులతోనే మొత్తం సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం పీసీఆర్ఎఫ్ ఘనత. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న సంస్థ ప్రభుత్వ పథకాల అమలుపై 'సహ' నిఘా వేస్తుంది. ప్రజాప్రయోజన అంశాలపై పీసీఆర్ఎఫ్ విరివిగా న్యాయస్థానాల్లో 'పిల్'లను దాఖలు చేస్తుంది. దీని కోసమే ప్రత్యేకంగా 'లీగల్ సెల్'ను కూడా నిర్వహిస్తోంది. 'స్థానిక సంస్థల స్వపరిపాలన' అనేది సంస్థ లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుతం 'స్థానిక సంస్థల స్వపరిపాలన' నమూనా చట్టం రూపకల్పనలో పీసీఆర్ఎఫ్ నిమగ్నమైంది.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008