|
|
| అన్యాయానికి అరదండాలు |
| ప్రచురణ తేది: 18/08/2009 |
|
అ మాయకపు ఆడపిల్ల.. ఓ కామాంధుడి కర్కశత్వానికి బలైంది. న్యాయం చేయాలంటూ ఠాణా మెట్లెక్కితే పట్టించుకున్నవారే లేరు. జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం. ఆ పరిస్థితుల్లో సహ చట్టం ఆమెను అక్కున చేర్చుకుంది. అఘాయిత్యం చేసిన వాణ్ని కటకటాల వెనక్కి పంపింది. గుజరాత్‌లోని సూరత్ జిల్లా ధన్‌వాడకు చెందిన ఓ మైనర్ బాలికపై హరేష్ వాసవ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయిస్తే.. వారు ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో ఆమె జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసింది. అయినా.. ఫలితం లేదు. ఇంతలో ఆ బాలిక గర్భం దాల్చింది. హరేష్‌ను కలిసి పెళ్లి చేసుకోమని కోరింది. తప్పకుండా వివాహం చేసుకుంటానన్న అతడు.. ఆ తర్వాత తాత్సారం చేశాడు. నెలలు నిండిన బాలిక మగబిడ్డను ప్రసవించింది. దురదృష్టవశాత్తూ రెండో రోజే ఆ పిల్లవాడు మరణించాడు. దాంతో హరేష్ అడ్డం తిరిగాడు. నీతో నాకు సంబంధం లేదుపొమ్మన్నాడు. మోసపోయిన ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈసారీ వారు పట్టించుకోకపోవడంతో.. గతంలో తాను చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేంటని అడుగుతూ సహ దరఖాస్తు చేసింది. సమాచారం రాలేదు. అప్పీలుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు రాష్ట్ర సమాచార కమిషన్ రెండో అప్పీలు చేసింది. సమాచారం ఇవ్వనందుకు విచారణానంతరం కమిషన్‌కు సంబంధిత స్టేషన్ పీఐవోకు రూ.25 వేల జరిమానా విధించింది. ఇంత జరిగినా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదు. సమాచారమూ ఇవ్వలేదు. దాంతో బాధితురాలు మళ్లీ కమిషన్‌ను ఆశ్రయించింది. స్పందించిన కమిషన్ పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అప్పుడు మేల్కొన్న పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం సూరత్ సెషన్స్ కోర్టులో కేసు నడుస్తోంది. నేరస్తుడికి సంకెళ్లు.. సమాచారమివ్వని అధికారులకు జరిమానా.. ఇదండీ సహ చట్టం గొప్పతనం. - ఎస్.పి.పరమేశ్వర్, అనంతపురం |
|