|
|
| నిధులు..'నీళ్ల'పాలు |
| ప్రచురణ తేది: 01/09/2009 |
|
న ల్గొండ జిల్లా అంటేనే గుర్తుకువచ్చేవి.. ఫ్లోరైడ్ బాధితుల వ్యథాభరిత జీవితాలు. తాగునీరే కాలకూటమై అవయవాలను మొద్ద్దుబార్చే పరిస్థితి. అలాంటి నీటిని పరీక్షించి స్వచ్ఛమైన జలాలను అందించాల్సిన అధికారులు.. ప్రయోగాల పేరుతో రూ.లక్షలను వృదా చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖకు సూర్యాపేటకు చెందిన కె.నర్సింహలు చేసిన సహ దరఖాస్తుతో వాస్తవాలు వెల్లడయ్యాయి. జిల్లాలో నీటి నమూనాలను తీసేందుకు గతంలో ప్రభుత్వం రూ.1200 వేతనంతో గ్రామానికి అయిదుగురు సిబ్బందిని నియమించింది. వీరికి 2006-07 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.22.90లక్షల ఖర్చుతో 12 మండల, 184 పంచాయతీ స్థాయి సదస్సులు నిర్వహించినట్లు లెక్కల్లో చూపారు. ఈ సదస్సుల్లో 1178 కెమికల్ కిట్స్, 70 వేల బ్యాక్టీరియా కిట్స్‌ను పంపిణీ చేసినట్లు రాశారు. ఈ సమావేశాలు ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో జరగలేదు. గ్రామాల్లో పంపిణీ చేసిన కిట్స్ కూడా నిరుపయోగంగా మారాయి. నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఉన్న 2 నీటి పరీక్ష ప్రయోగశాలల నిర్వహణకు గత మూడేళ్లలో రూ.20.77 లక్షలు వెచ్చించినట్లు రాశారు. ఈ మొత్తం తతంగంలో రూ.లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై 'ఈనాడు'లో ఆగస్టు 7న కథనం ప్రచురితమైంది. దాంతో స్పందించిన కలెక్టర్ ఎస్ఏఎం రిజ్వీ నీటి నమూనాలను ఇకపై పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. బాక్టీరియా, కెమికల్ కిట్స్‌ను పంచాయతీ సిబ్బందికి ఇచ్చి నమూనాలను తీయించి గ్రామీణ నీటి సరఫరా శాఖాధికారులకు అందించనున్నారు.
- వై.వి.వి.అమరేంద్ర, న్యూస్‌టుడే, నల్గొండ |
|